‘నా సామిరంగా’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కన్నడభామ అషికా రంగనాథ్. ప్రస్తుతం ఆమె చిరంజీవి ‘విశ్వంభర’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల్లో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ హీరో తిరువీర్‌తో కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నట్లు తెలిసింది. డ్యూడ్, డ్రాగన్ వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన కృష్ణ చేపూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మిస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నదని, వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఇదిలావుండగా అషికా రంగనాథ్ నటించిన తాజా కన్నడ చిత్రం ‘గత వైభవ’ తెలుగులో ‘గత వైభవం’ పేరుతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.