Asha Bhosle | భారతీయ సంగీత దిగ్గజ గాయని ఆశా భోంస్లే (91) మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ నకిలీ పోస్ట్ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే స్పందిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నారని ఆనంద్ భోంస్లే తెలిపారు.
జూలై 1న ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ.. అందులో ఆశా భోంస్లే చిత్రానికి దండ వేసి, “ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు – ఒక సంగీత శకం ముగిసింది” అనే క్యాప్షన్‌ను జతచేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, పలువురు అభిమానులు దిగ్భ్రాంతికి గురై సంతాప సందేశాలు పెట్టడం ప్రారంభించారు. ఈ వదంతులు అంతటా వ్యాపించడంతో, పలు ప్రముఖ మీడియా సంస్థలు రంగంలోకి దిగి నిజ నిర్ధారణ చేపట్టాయి. అనంతరం ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పాయి. ఇదే సమయంలో ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కూడా స్పందించారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు.
ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. ఆశా భోంస్లే ఇటీవలే ఓ బహిరంగ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 44 ఏళ్ల తర్వాత తిరిగి విడుదలైన రేఖ నటించిన క్లాసిక్ చిత్రం ‘ఉమరో జాన్’ ప్రత్యేక ప్రదర్శనకు ఆమె హాజరయ్యారు. కేవలం హాజరు కావడమే కాకుండా, వేదికపైకి వచ్చి తన గానంతో అక్కడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. దీంతో ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు గట్టి సమాధానం ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.