Maa Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సుదీర్ఘ విరామం అనంతరం గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా సమంత నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.1990ల నాటి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత ‘స్వర్ణ’ అనే పాత్రలో కనిపించారు. మిస్టీరియస్ గతాన్ని దాచిపెట్టి ఒక సంప్రదాయ ఉమ్మడి కుటుంబానికి చెందిన యువ డాక్టర్‌ను ప్రేమించి వివాహం చేసుకునే యువతిగా ఆమె నటించారు. పెళ్లి తర్వాత కుటుంబాన్ని ఒప్పించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, గతం వెంటాడే సంఘటనలు, కుటుంబంలో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
సినిమా మొత్తం సమంత నటన ప్రధాన ఆకర్షణగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ ఎమోషన్స్‌ను సమంత అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో సమంత కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు పారితోషికం తీసుకునే సమంత, ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా వ్యవహరించడంతో ఆమెకు డబుల్ బెనిఫిట్ లభించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా విడుదలకు ముందే జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా నిర్మాణ వ్యయం దాదాపు రికవరీ అయినట్లు సమాచారం. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా మంచి ఆదాయం రావడంతో నిర్మాతగా సమంత లాభాల్లో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో సమంత భర్త పాత్రలో కన్నడ నటుడు దిగంత్ మంచాలే నటించారు. ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా కోసం దిగంత్ సుమారు రూ.50 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన గుల్షన్ దేవయ్య కూడా తన నటనతో ఆకట్టుకున్నారని టాక్. పూర్తి సినిమాకు గాను ఆయన సుమారు రూ.1.5 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. గతంలో సరదాగా ఒక్కో సీన్‌కు రూ.25 లక్షలు తీసుకుంటానని చెప్పిన ఆయన రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నటి గౌతమి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 80, 90 దశకాల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన ఆమె, ఈ సినిమాలో తన పాత్రకు సుమారు రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే బుల్లితెర యాంకర్, నటి శ్రీముఖి కూడా సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు. ఆమెకు రూ.35 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. మరో నటి మంజూష ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.10 లక్షలు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ‘మా ఇంటి బంగారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంతకు ఈ చిత్రం విజయవంతమైన కంబ్యాక్‌గా నిలిచింది. నటిగా తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవడంతో పాటు నిర్మాతగా కూడా లాభాలను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.