Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి ఏడీ 2898. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో ఇదో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిపోతుంది. కల్కిలో ప్రభాస్‌ను చూస్తే తనకు జోకర్లా కనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ నోరుపారేసుకున్నాడు. కల్కిలో ప్రభాస్ లుక్ మెల్ గిబ్బన్స్లా గంభీరంగా కనిపించాల్సి ఉండగా.. దానికి భిన్నంగా కనిపించే సరికి బాధపడ్డానని చెప్పాడు. ప్రభాస్‌ను మ్యాడ్ మ్యాక్స్ సినిమా తరహాలో చూడాలనుకుంటున్నానని.. కల్కిలో లుక్ ఎందుకు ఎందుకు అలా ఉందో అర్థం కాలేదని చెప్పాడు.
ప్రభాస్ విషయంలో తన అభిప్రాయం చెప్పేందుకు బాధపడుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కల్కి మూవీ చూశానని.. తనకు సినిమా ఏమాత్రం నచ్చలేదని చెప్పాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్‌తో పోలిస్తే ప్రభాస్ పాత్ర తేలిపోయిందని.. అమితాబ్ ఈ వయసులో అలాంటి సినిమాలు ఎలా చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తి తనలో శక్తిలో కొంతైనా ఉంటే జీవితం సెటిల్ అయిపోతుండేదన్నాడు. అర్షద్ వ్యాఖ్యలపై యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లు, అహంకారం తదితర లక్షణాలను ఇంకా బాలీవుడ్ వదిలించుకున్నట్లు లేదని.. అందుకే వెనుకపడిపోయారని విమర్శించారు. నెపోటిజం మాఫియా అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడ్డాడు.
ఓ రౌంత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది పురుష్’ చేశాడు. ఎలా తీరాశో అందరూ చూశారు’ అంటూ మరో యూజర్ మండిపడ్డాడు. అర్షద్ వార్సీ ఎక్కువ సహాయ నటుడి పాత్రలు పోషించే విషయం తెలిసిందే. గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లో సంజయ్ దత్ అనుచరుడు ‘సర్క్యూట్’ పాత్ర పోషించాడు అర్షద్. అయితే, కొంతకాలంగా బాలీవుడ్లో దక్షిణాది చిత్రాలు రాణిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తున్నది. సౌత్ మూవీలు, టేకింగ్‌కు సైతం అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదే విషయాన్ని సంజయ్ దత్ సైతం ప్రస్తావించిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో గతంలో ఉన్న మాస్ యాక్షన్ హీరోయిజం పోయిందని.. ప్రస్తుతం అది దక్షిణాది సినిమాల్లో కనిపిస్తుందని చెప్పాడు. అందుకే ఆ సినిమాలను దేశవ్యాప్తంగా అభిమానులు ఆదరిస్తున్నాడని చెప్పడం తెలిసిందే.