Prudhviraj | టాలీవుడ్ యాక్టర్ పృథ్విరాజ్ (Prudhviraj)కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. పృథ్విరాజ్ భార్య బాలిరెడ్డి శ్రీలక్ష్మికి ప్రతీ నెలా మనోవర్తి చెల్లించాలంటూ కోర్టు గతంలోనే ఆదేశించినా లెక్కచేయకపోవడంతో.. శ్రీలక్ష్మి తాజాగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతోపాటు కోర్టుకు హాజరుకాని కారణంగా పృథ్విరాజ్‌కు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలి రెడ్డి పృథ్విరాజ్ విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని 1984లో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే కొంతకాలం సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉన్న శ్రీలక్ష్మి తనకు నెలకు రూ.8 లక్షలు భృతి ఇప్పించాలని కోరుతూ 2017లో కోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రతీ నెలా 10వ తేదీలోపు ఆమె కోరినట్టుగా భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు భరణం చెల్లించకపోవడంతో తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
పృథ్విరాజ్ తమ వివాహం అనంతరం విజయవాడలోని తన పుట్టింట్లోనే ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవాడని, ఆ సమయంలో అతని ఖర్చులన్నీ పుట్టింటివాళ్లే భరించారని శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపింది. సినిమాల్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా మారిపోయిన ఆయన తనను వేధించేవాడని కోర్టుకు తెలిపింది. తనను 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని అప్పటినుంచి పుట్టింటిలోనే ఉంటున్నానని కోర్టుకు చెప్పింది.