Arjun S/O Vyjayanthi On Prime | టాలీవుడ్ నటులు కల్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. తల్లి కొడుకుల అనుబంధం, యాక్షన్ ప్రధానంగా సాగిన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఈ సినిమా మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే.. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను వదిలారు మేకర్స్.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైజయంతి(విజయశాంతి) సిన్సియర్ ఐపీఎస్ ఆఫీస్. ఆమెకు ఒక్కకానొక్క కొడుకు అర్జున్(కల్యాణ్‌రామ్). అర్జున్‌ని ఎలాగైనా ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలనేది వైజయంతి కల. అందుకు తగ్గట్టే తనను ఐపీఎస్ చదివిస్తుంది. ట్రైనింగ్ కోసం ఢిల్లీ పంపిస్తుంది. ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగిరావాల్సిన అర్జున్.. వెళ్లిన అయిదోరోజే తిరిగి వచ్చేస్తాడు. కారణం తన తండ్రి మరణం. నావీ అధికారి అయిన తన తండ్రి సముద్రంలో ప్రమాదవశత్తూ మరణించాడని పోలీసులు చెబుతారు. నిజానికి అర్జున్ తండ్రి మరణానికి కారణం ప్రమాదం కాదు.. అదో హత్య. ఆ విషయం తెలుసుకున్న అర్జున్.. తన తండ్రిని చంపిన వ్యక్తులపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ.. అర్జున్‌ని వైజయంతి వారిస్తుంది. చట్టప్రకారం దోషులకు శిక్షపడేలా చేస్తానని, నువ్వు ఐపీఎస్ పూర్తి చేయాలని చెప్పి కొడుకుని మళ్లీ ట్రైనింగ్‌కి పంపించేస్తుంది. ఏడాది తర్వాత అర్జున్ ట్రైనింగ్ ముగించుకొని తిరిగొస్తాడు. తన తండ్రి కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఆరోజే. అర్జున్ తండ్రిది హత్య కాదని, అది ప్రమాదవశత్తే జరిగిందని కోర్టు తీర్పు ఇస్తుంది. హంతకులు కోర్టు నుంచి బయటకొస్తూనే వైజయంతిని అవమానంగా మాట్లాడతారు. అన్యాయం ముందు చట్టం, న్యాయం ఓడిపోవడం కళ్లారా చూస్తాడు అర్జున్. తన కళ్లముందే తల్లిని అవమానిస్తుంటే భరించలేకపోతాడు. అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. కోర్టు ఎదురుగానే హంతకుడ్ని కొట్టి చంపేస్తాడు. అంతేకాదు, తన తండ్రి హత్యకు కారణమైన ముఠాలో 41మందిని నరికి చంపేస్తాడు. ఐపీఎస్ కావాల్సిన కొడుకు కంటిముందే హంతకుడుగా మారడం చూసిన వైజయంతి నిశ్చేష్టురాలైపోతుంది. గూండాగా మారిన కొడుకు మీదే యుద్ధానికి సిద్ధమవుతుంది. మరి విధి విడదీసిన ఈ తల్లీబిడ్డలు మళ్లీ ఎలా కలిశారు? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ గూండాగా మారి సాధించిందేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.