Arjun Rampal-Gabriell | బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా పెళ్లి విషయంలో అర్జున్ రాంపాల్ స్పష్టత ఇచ్చాడు. గత ఆరేళ్లుగా మోడల్, నటి గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్తో అర్జున్ రాంపాల్ డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఇంతకాలం కలిసి జీవిస్తున్నప్పటికీ వీరి పెళ్లిపై ఎప్పుడూ స్పష్టత లేదు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ పాడ్కాస్ట్లో పాల్గొని తమ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ పాడ్కాస్ట్లో యాంకర్ అర్జున్ రాంపాల్–గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్ల పెళ్లి గురించి ప్రశ్నించగా, అర్జున్ రాంపాల్ స్పందిస్తూ, “మాకు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ ఇంకా పెళ్లి కాలేదు” అని వెల్లడించాడు. దీనికి గాబ్రియెల్లా స్పందిస్తూ, “పెళ్లి ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు” అని చెప్పడంతో యాంకర్ షాక్కు గురయ్యాడు. అయితే ఆరేళ్లుగా కొనసాగుతున్న వారి ప్రేమ ఇప్పుడు అధికారికంగా నెక్స్ట్ స్టెప్కు చేరినట్టుగా స్పష్టమవుతోంది. ఎంగేజ్మెంట్ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే పెళ్లి కూడా ఉండొచ్చన్న చర్చ బాలీవుడ్ వర్గాల్లో మొదలైంది.
ఇక అర్జున్ రాంపాల్ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే, ఆయన 1998లో ప్రొడ్యూసర్ మెహర్ జెసియాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే పరస్పర విభేదాల కారణంగా 2018లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్తో ప్రేమలో పడ్డ అర్జున్ రాంపాల్, పెళ్లి చేసుకోకుండానే ఆమెతో కలిసి జీవిస్తూ ఇద్దరు కుమారులకు తండ్రయ్యాడు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ వార్తతో అర్జున్ రాంపాల్–గాబ్రియెల్లా జంట పెళ్లిపై మరోసారి ఆసక్తి నెలకొంది. ఈ జంట ఎప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతుందన్నది చూడాల్సి ఉంది.