మలైకా అరోరా.. ఐదు పదుల వయసులోనూ పాతికేళ్ల పడుచులకు ఏమాత్రం తీసిపోని సౌందర్యరాశి. సినిమాలతో సంబంధం లేకుండా నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ! ఆమె గురించిన ప్రతి వార్తా ఓ సెన్సేషనే! అది అర్బాజ్ ఖాన్‌తో విడాకులైనా.. అర్జున్ కపూర్‌తో డేటింగ్ ముచ్చటైనా.. సోషల్ మీడియాలో చర్చ సాగాల్సిందే! తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా అరోరా.. తన వ్యక్తిగత, వృత్తి జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకున్నది. తాను ఇప్పుడు ఎలాంటి విచారం లేకుండా జీవిస్తున్నాననీ వెల్లడించింది.
‘నాపై వచ్చే విమర్శలు నన్నెప్పుడూ బాధించలేదు. పైగా ఆ ప్రతికూలతల నుంచే ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా! అంతేకాదు.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగానూ నేనిప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నా. దానికి కారణం.. నేను తీసుకున్న నిర్ణయాలే!’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘చాలా సినిమాల్లో అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాల్లోనే నటించా. నేనే ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయాలని ఉన్నది!’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది మలైకా. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత.. తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ కొనసాగించింది మలైకా! తాజాగా, వీరిద్దరూ విడిపోయారనే వార్త.. బీటౌన్‌లో షికారు చేస్తున్నది. ఆ బ్రేకప్ను ఉద్దేశించే మలైకా ఇలా మాట్లాడిందంటూ నెట్టింట చర్చ నడుస్తున్నది.