‘నాకు పాఠశాల రోజుల నుంచే పురాణాలు, ఇతిహాసాల పట్ల ఆసక్తి ఉంది. మన పురాణాల్లో అరిషడ్వర్గాలను జయించాలని చెప్పారు. కానీ అందుకు ఎలాంటి మార్గాలను అనుసరించాలో వివరించలేదు. ఈ సినిమా ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాం’ అని అన్నారు దర్శకుడు జయశంకర్. ‘పేపర్‌బాయ్’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘అరి’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు జయశంకర్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సినిమా కోసం ఎంతో పరిశోధన చేశానని, హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పానని, వారు మంచి ప్రయత్నమని అభినందించారన్నారు. అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలను తెలుసుకున్నానని, వాటి ఆధారంగానే ఈ సినిమా తీశానని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ‘ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. వినోద్‌వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్ని పోషించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ రచయితలు మల్లాది వెంకటకృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమా చూసి బాగుందని ప్రశంసించారు. వెంకయ్యనాయుడుగారు ఈ సినిమా ‘అభినవ భగవద్గీత’లా ఉందని మెచ్చుకున్నారు. మన పురాణాలు, ఇతిహాసాలు చదవని యువతకు ఈ సినిమా చూస్తే వాటిలోని సారాంశం అర్థమవుతుంది. త్వరలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్లో షూటింగ్ మొదలవుతుంది’ అన్నారు.