Ari Movie | ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో నిర్మితమైన ‘అరి’ చిత్రం ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ దర్శకుడు జయశంకర్ రూపొందించిన ఈ సినిమాలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. అయితే అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం) ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ: మనిషిలోని ఆరు అంతర్గత శత్రువులు మానవుడిలోని ఆరు బలహీనతలకు ప్రతీకగా ఆరు ప్రధాన పాత్రలను దర్శకుడు పరిచయం చేస్తారు. ఈ ఆరు పాత్రలు వారి వింత కోరికలు తీర్చుకోవడం కోసం ఎలాంటి పనులకైనా సిద్ధపడతాయి.
కామం: సన్నీ లియోన్‌తో గడపాలని కోరుకునే అమూల్ (వైవా హర్ష).
లోభం: కుటుంబ ఆస్తిని దక్కించుకోవాలని చూసే గుంజన్ (శుభలేఖ సుధాకర్).
మోహం: చనిపోయిన భర్తను తిరిగి కోరుకునే లక్ష్మీ (సురభి ప్రభావతి).
మదం: డబ్బు, హోదాతో శాశ్వతంగా బతకాలని ఆశించే విప్లవ్ నారాయణ్ (సాయి కుమార్).
క్రోధం/మాత్సర్యం: నిధి కోసం వేటాడుతున్న ఇన్స్పెక్టర్ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) మరియు తన సహోద్యోగి కంటే అందంగా కనిపించాలని కోరుకునే ఆత్రేయి (అనసూయ).
ఈ ఆరుగురూ ‘ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును’ అనే ప్రకటన చూసి, తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక రహస్య ప్రయాణం మొదలుపెడతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న టాస్కులు ఏమిటి? వారి కోరికలు తీరాయా? మనిషిలోని బలహీనతలను దర్శకుడు ఎలా చూపించారు? ఈ ఆరు కథలు చివరకు ఏ తీరానికి చేరాయి? అనేది సినిమా ప్రధాన కథాంశం.
నటీనటులు
సినిమాలోని భారీ తారాగణం వారి పాత్రల పరిధిలో అద్భుతంగా నటించి మెప్పించారు. ముఖ్యంగా, ప్రధాన పాత్రలో కనిపించిన వినోద్ వర్మ నటన, హావభావాలు సినిమాకు పెద్ద బలం. తన పాత్ర ద్వారా కథను ముందుకు నడిపించడంలో వినోద్ వర్మ కృషి కనిపిస్తుంది. సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష వంటి అనుభవజ్ఞులైన నటులు తమ పాత్రల్లో లీనమైపోయారు. మధ్యమధ్యలో వచ్చే చతుర, వితుర పాత్రలు కొంత హాస్యాన్ని పంచుతాయి.
విశ్లేషణ:
ప్రథమార్థం ఆరు పాత్రల పరిచయం, వారి వింత కోరికలు, మరియు ‘కోరికలు తీర్చే ప్రకటన’ చుట్టూ ఆసక్తికరంగా తిరుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే కీలకమైన ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కథకు వెన్నెముకగా నిలిచేది ద్వితీయార్థం. ఆరు పాత్రలు వారి కోరికల కోసం దిగజారే విధానం, ఆపై వారిలో కలిగే భావోద్వేగ మార్పును దర్శకుడు అద్భుతంగా చూపించారు. మనిషి తన అరిషడ్వర్గాలను ఎలా జయించాలి, సక్రమమైన జీవితం ఎలా ఉండాలి అనే సందేశాన్ని దర్శకుడు చాలా బలంగా ప్రేక్షకుల మనస్సుల్లోకి ఎక్కించగలిగారు. ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా, గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఈ సినిమా కథాంశం యూనివర్సల్ కాన్సెప్ట్ అయినందున, భవిష్యత్తులో ఇతర భాషల్లో రీమేక్ అయ్యే అవకాశం ఉంది.
సాంకేతిక వర్గం
సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం (R.R.) కథనానికి, భావోద్వేగాలకు బలాన్నిచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. చిన్న బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, వీఎఫ్ఎక్స్ క్వాలిటీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి భిన్నమైన, సందేశాత్మక చిత్రాన్ని ధైర్యంగా నిర్మించిన నిర్మాతలను అభినందించాలి.
తీర్పు
అరిషడ్వర్గాలు, ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవారు, అలాగే ఏదైనా బలమైన సందేశం ఉన్న కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారు ‘అరి’ చిత్రాన్ని తప్పక చూడాలి. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన సంతృప్తిని, ఆలోచింపజేసే సందేశాన్ని అందిస్తుంది.
రేటింగ్: 3/5