అనసూయ, సాయి కుమార్, సుమన్, ఆమని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. జయశంకర్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చిన్నారి కిట్టయ్య సిత్రాల కిట్టయ్య..’ అనే పాటను హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ అధ్యక్షులు శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో నటుడు సాయి కుమార్ పాల్గొన్నారు. అనూప్ రూబెన్స్ స్వరపర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా…మంగ్లీ పాడారు. పాట విడుదల సందర్భంగా గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ…‘ఈ పాటలో కృష్ణ తత్వాన్ని చిన్న చిన్న పదాలతో అందంగా చెప్పే అవకాశం నాకు దక్కింది. మన ఇళ్లలో చిన్న పిల్లలను కృష్ణ రూపాలుగానే చూస్తాం. భగవద్గీత చదివితే కృష్ణతత్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ పాట సినిమాకు ఆకర్షణ అవుతుంది’ అన్నారు.