AR Rahman |భారతీయ సంగీత ప్రపంచంలో అపార ప్రతిష్టను సంపాదించిన మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఇటీవల తన ఆధ్యాత్మిక ప్రయాణం, సూఫీయిజం స్వీకరణ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మద్రాసులో దిలీప్ కుమార్ రాజగోపాలన్ అనే హిందూ కుటుంబంలో జన్మించిన రెహమాన్, తరువాత సూఫీయిజం ప్రభావంతో ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మార్పుకు కారణాలేమిటో ఆయన స్వయంగా వివరించారు. నిఖిల్ కామత్ నిర్వహించిన పోడ్కాస్ట్లో రెహమాన్ మాట్లాడుతూ..నేను హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు సహా అన్ని మతాల గురించి చదివాను. మతం పేరుతో ఇతరులని హింసించడం నాకు అస్సలు నచ్చదు. మనం వినోదం కోసం కలిసి వచ్చే ప్రతి సంగీత వేదిక నాకు ఒక పుణ్యస్థలంలా అనిపిస్తుంది. భిన్న మతాలు, భిన్న భాషల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ద్వారా ఒకటవుతారు అని తెలిపారు.
సూఫీయిజం పట్ల తన ఆకర్షణను తెలిపారు రెహమాన్.“సూఫీయిజం అంటే చనిపోయే ముందు చనిపోవడం లాంటిది. అహంకారం, లోభం, అసూయ వంటి భావాలు చనిపోవాలి. ఈ తెరలు తొలగితేనే మనం పారదర్శకత, ప్రేమ, దయ వంటి లక్షణాలను పొందుతాం,” అని చెప్పారు. మనం ఏ మతాన్ని అనుసరించినా… చివరికి నమ్మకం, నిజాయితీ, మంచి పనులు మాత్రమే ముఖ్యం. ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటే భౌతిక శ్రేయస్సు కూడా సహజంగానే వస్తుంది,” అని తెలిపారు. సూఫీయిజాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న ప్రశ్నకు, సూఫీ మార్గంలో ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరు. ఇది హృదయం నుంచి వచ్చే నిర్ణయం. నాకు, మా తల్లికి ఆధ్యాత్మికంగా ఇది సరైన మార్గం అనిపించింది. మేము సంగీత విద్వాంసులం… ఈ మార్గం మాకు మరింత స్వేచ్ఛను ఇచ్చింది,” అని స్పష్టం చేశారు.
ఇక ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం వైవిధ్యమైన చిత్రాలకి పని చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ – జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రానున్న రోజులలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన మరికొన్ని బాణీలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.