గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గాయని, అందుకు మారిన అధికార సమీకరణాలు ఒక కారణమైతే, మత కోణం కూడా మరో కారణం కావొచ్చంటూ అగ్ర సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాను ముస్లిం కావడం వల్లే అవకాశాలు తగ్గాయని భావిస్తున్నానని, అయితే మతపరమైన వివక్షను తాను నేరుగా ఎదుర్కోలేదని ఆయన పేర్కొన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఏ.ఆర్.రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సృజనాత్మకతతో ఏమాత్రం సంబంధం లేని కొందరు వ్యక్తులు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసించే రోజులొచ్చాయి.
కెరీర్ తొలిరోజుల్లో రోజా, బాంబే, దిల్సే వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించినప్పటికీ నన్ను అవుట్సైడర్గానే బాలీవుడ్ ఇండస్ట్రీ పరిగణించింది. ‘తాళ్’ సినిమాతో నేను ఉత్తరాది ప్రేక్షకులకు బాగా చేరువయ్యాను. ఎందుకంటే ఆ సినిమా మ్యూజిక్‌లో కొంచెం హిందీ, పంజాబీ మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది’ అని ఏ.ఆర్.రెహమాన్ చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బాలీవుడ్ ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఓ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు మతపరమైన కోణంలో మాట్లాడటం తగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.