Srinu Vaitla | తెలుగు చిత్రసీమలో దర్శకుడు శ్రీనువైట్ల శైలి చాలా ప్రత్యేకం. యాక్షన్ కథాంశాలకు చక్కటి వినోదాన్ని జోడించి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందించారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘విశ్వం’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు శ్రీను వైట్ల పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు…
గోపీచంద్‌తో సినిమా చేయాలని ఎప్పుట్నుంచో అనుకుంటున్నా. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేశా. యాక్షన్, కామెడీ, ఎమోషన్ అంశాలు సమపాళ్లలో మేళవించిన కుటుంబ కథా చిత్రమిది. నా శైలి కామెడీతో ఆకట్టుకుంటుంది. ఈ కథలో పాప పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
ఈ విశ్వంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలుంటాయి. ఈ సినిమాలోని హీరో పాత్ర కూడా నిగూఢమైన రహస్యాలతో సాగుతుంది. అందుకే కథానుగుణంగా ఈ టైటిల్ పెట్టాం. దర్శకుడిగా నేను కాస్త గ్యాప్ తీసుకున్నా. అయినా నేటి ట్రెండ్‌ను గమనిస్తూ, సినిమాలు చూస్తూ అప్డేట్ అయ్యాను. ఇప్పటి అభిరుచులకు అనుగుణంగా నా శైలి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశా.
సొసైటీలోని ఓ బర్నింగ్ ఇష్యూని తీసుకొని ఈ కథను సిద్ధం చేశా. నా గత చిత్రాల్లో హీరో తన తెలివితేటలతో ఏదైనా సాధించేవాడుగా కనిపిస్తాడు. ఆ టెంప్లెట్కు భిన్నంగా ఈ కథ ఉంటుంది. మేకింగ్ కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. గోపీచంద్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది.
ఈ సినిమాలో ట్రెయిన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుంది. చాలా మంది ‘వెంకీ’ సినిమా తరహాలో ఈ ఎపిసోడ్ క్రియేట్ చేశారా అని అడుగుతున్నారు. రెండు సినిమాలకు ఏమాత్రం సంబంధం ఉండదు. కథ డిమాండ్ మేరకే ట్రెయిన్ ఎపిసోడ్ పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమాలోని ట్రెయిన్ ఎపిసోడ్లో వెన్నెల కిషోర్, గణేష్, నరేష్, కవిత, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ కడుపుబ్బా నవ్విస్తారు.
నేటి ప్రేక్షకులు కామెడీని ఆస్వాదించే విధానం మారిపోయింది. వినోదం కోసం వారికి ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే కథలో కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. నిజానికి అది చాలా కష్టమైన విషయం.
ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ కోసం మాత్రమే తీశాను. ఒకవేళ పాన్ ఇండియాకు రీచ్ అయితే సంతోషమే. ‘ఢీ’ సీక్వెల్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శ్రీహరిగారి పాత్రను రీప్లేస్ చేయడం చాలా కష్టమని నా అభిప్రాయం.