Ticket Rates | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర వార్2 , కూలీ చిత్రాలు పోటీ పడేందుకు సిద్ధం కాగా, ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం ప్రభంజనం సృష్టిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ టిక్కెట్ రేట్ల విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. చెన్నైలో ధరలు తక్కువగా ఉన్నాయని , హైదరాబాద్‌లో మాత్రం భారీగా పెంచారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయికలో రూపొందిన వార్ 2, రజనీకాంత్ నటించిన కూలీ సినిమాల టికెట్ల ధరలను పెంచుకోవడానికి మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై హైప్ నెలకొని ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమాకు స్పెషల్ షోలు, అధిక ధరలకి టికెట్ల విక్రయం కోసం అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రిలీజ్ రోజున ఉదయం 5 గంటలకు స్పెషల్ షో నిర్వహించుకోవచ్చని పేర్కొంది.ఈ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. మరోవైపు కూలీ సినిమాకు కూడా టికెట్ ధరల పెంపు విషయంలో అనుమతి లభించింది. ఆగస్ట్ 14 నుంచి 23వ తేదీ వరకు అంటే విడుదలైన మొదటి 10 రోజుల పాటు , కింది విధంగా టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది:
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.75, మల్టీప్లెక్స్‌లలో అదనంగా రూ.100 , అలాగే బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 4-5 గంటలకు జరిగే ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చారు. వార్2, కూలీ చిత్రాలకి సంబంధించిన అన్ని ధరల మార్గదర్శకాలు ఒకేలా ఉంటాయని, ఒకే విధమైన టికెట్ ధర విధానం అనుసరించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ రెండు చిత్రాలకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా వార్ 2 ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.దీంతో మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరోవైపు కూలీకి సంబంధించి తెలుగులో నాగ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.