Chhaava Movie Telugu | బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఛావా సినిమాను తెలుగులో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. మార్చి 07న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలను ఆపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ జియా ఉల్ హక్ నేతృత్వంలోని బృందం నెల్లూరు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది. ఈ లేఖలో ఛావా చిత్రం విడుదలను ఆపివేయాలని ఈ చిత్రం చరిత్రను వక్రీకరించి చిత్రీకరించబడిందని, దీని విడుదల వల్ల రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వినతిపత్రంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే సినిమా విడుదలపై తుది నిర్ణయం స్థానిక అధికారులు సెన్సార్ బోర్డు అభిప్రాయాల ఆధారంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీసింది, కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు ఫెడరేషన్ ఆందోళనలను సమర్థిస్తున్నారు.
ఛావా సినిమా విషయానికి వస్తే.. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji Maharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. శంభాజీ మహరాజ్(Shambaji Maharaaj) పాత్రలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహించగా.. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా రూ.450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.