Kannappa Movie Ap High Court | మంచు విష్ణు కథానాయకుడిగా.. మంచు మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న కన్నప్ప సినిమాపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ సినిమా విడుదలను ఆపివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా.. సినిమా విడుదలను ఆపివేయాలనే పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే ఈ వివాదంకి సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సీఈఓ, CBFC ప్రాంతీయ కార్యాలయ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్, అలాగే నటులు మోహన్ బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి. వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.
అలాగే సినిమా విడుదలైన తర్వాత అభ్యంతరకర విషయాలు ఏమైనా ఉంటే, వాటిని తొలగించేలా ఆదేశిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో, ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు హైకోర్టు నుంచి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.