Anvesh | యూట్యూబర్ అన్వేష్ ఇటీవల హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, సోషల్ మీడియాలో అతడిపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం, యూట్యూబ్ ఛానల్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపులు రావడంతో అన్వేష్ ఫాలోవర్ల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో అన్వేష్ తాజాగా ‘ఆరెంజ్ జ్యూస్’ పేరుతో మరో వీడియోను పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. దేవుడి పేరును ప్రస్తావిస్తూ, తనకు కలలో సందేశాలు వచ్చాయంటూ చెప్పడం మరోసారి వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో అన్వేష్.. ఆంజనేయ స్వామి తన కలలో కనిపించారని, ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారని చెప్పాడు. కాషాయం రంగును ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న వారిపై పోరాటం చేయాలని దేవుడు చెప్పినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు, తాను ఇకపై అసభ్య పదజాలం ఉపయోగించబోనని, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానని కూడా తెలిపాడు.
అయితే ఈ వీడియోలోనూ మతం, దేవుడి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. కొందరు స్వామి మాలలు వేసుకుని మోసం చేస్తున్నారని, మతాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు జరుగుతున్నాయని అన్వేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా “దుష్టులను శిక్షించమని దేవుడు చెప్పాడు” వంటి వ్యాఖ్యలు ప్రమాదకరంగా ఉన్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు దోపిడీలు దొంగతనాలు చేస్తూ జై శ్రీరామ్ అంటున్నారుని, ఇండియా రాముడి పేరుతో చాలా మోసం జరుగుతుందని అన్నాడు.. మతం మత్తులో అన్యాయాలు, అక్రమాలు చేసి జైశ్రీరామ్ అంటున్నారని, అలాంటి బత్తాయిలను కొట్టమని దేవుడు నాకు చెప్పాడంటూ అన్వేష్ పేర్కొన్నాడు. చాలా వింగ్స్ ఉండగా, ఆ రెక్కలను ఒక్కొక్కటిగా నరికేయమని దేవుడు చెప్పాడంటూ అన్వేష్ కామెంట్ చేశాడు. అయితే అన్వేష్ ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోలేదని, వివాదాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించకుండా, మళ్లీ దేవుడి పేరును ఉపయోగిస్తూ తన మాటలను సమర్థించుకోవడం సరికాదని మండిపడుతున్నారు.