Anushka Sharma and Virat Kohli | బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు తమ ఆధ్యాత్మిక చింతనతో మరోసారి నెటిజన్ల మనసులను గెలుచుకున్నారు. ఇటీవల వీరిద్దరూ బృందావన్‌లోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు అయిన ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకుని ఆశీస్సులు పొందిన విషయం తెలిసిందే. తాజాగా అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు ఈ దంపతులు. ఈ ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
విరుష్క దంపతులు తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. గతంలో ఉజ్జయిన్‌లోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని, ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించారు. బృందావన్‌లో ప్రేమానంద్ మహారాజ్‌ను కలవడం వారికి కొత్తేమీ కాదు; గతంలో కూడా వారు తమ కూతురు వామికతో కలిసి మహారాజ్‌ను కలిశారు. ఈసారి, అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించడం ద్వారా వారి ఆధ్యాత్మిక చింతనను మరోసారి చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన ఈ జంట, ఎంతో వినయంగా పూజలు నిర్వహించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చిత్రాలు, వీడియోలపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విరాట్, అనుష్కల భక్తిని, వినయాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. తమ బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించడం పట్ల చాలా మంది నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఈ జంట ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సందర్శన అద్దం పడుతోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.