Anurag Kashyap Slams Netflix and Prime Video | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల కంటెంట్‌పై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న కంటెంట్ భారతీయ టెలివిజన్, ముఖ్యంగా ఇండియన్ న్యూస్ ఛానెళ్ల కంటే కూడా దరిద్రంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ ఓటీటీ వేదికలు కేవలం సబ్స్క్రిప్షన్లు, లాభాలు పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నాయని విమర్శించారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా అల్గారిథమ్‌లను అనుసరించడం వల్ల క్రియేటివిటీ, కళాత్మక విలువలు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కథలు చెప్పడానికి, విభిన్నమైన సినిమాలు తీయడానికి ఒక మంచి అవకాశంగా మొదట్లో కనిపించాయని కశ్యప్ గుర్తు చేశారు. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పనిచేసిన ‘సేక్రెడ్ గేమ్స్’, ‘లస్ట్ స్టోరీస్’ వంటి ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇచ్చాయని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు, ఈ వేదికలు కేవలం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా “కంటెంట్”ను సృష్టించడంపైనే దృష్టి పెడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నిజమైన కళను, సినిమాను ప్రోత్సహించే విధానం కాదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ విధానం వల్ల కంటెంట్ నాణ్యత తగ్గిపోతోందని, ఇది ఒకప్పుడు టెలివిజన్‌లో ఉన్న క్వాలిటీ కంటే కూడా దిగజారిపోయిందని అనురాగ్ కశ్యప్ చెప్పుకోచ్చాడు. ఇక అనురాగ్ చేసిన వ్యాఖ్యలు కేవలం హిందీ పరిశ్రమకు మాత్రమే కాకుండా, తెలుగు సహా ఇతర భాషల్లోని ఓటీటీ కంటెంట్‌కు కూడా వర్తిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.