Anurag Kashyap Slams CBFC | సెన్సార్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరితో పాటు టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తదితర సినీ ప్రముఖులు సెన్సార్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ భారత సెన్సార్ బోర్డు (CBFC) ఆగ్రహం వ్యక్తంచేశారు. మలయాళం నుంచి వస్తున్న ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా.. సురేష్ గోపి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు జానకి అని ఉండడం వలన అది దేవత సీతకి మరోపేరు అని ఆ పేరుని తొలగించాలని సెన్సార్ బోర్డు కోరింది. దీంతో ఈ విషయంపై పలువురు సెన్సార్ బోర్డును తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా వివాదంపై అనురాగ్ మాట్లాడుతూ..
కథలు రాసేటప్పుడే పాత్రలకు పురాణాల్లోని పేర్లు ఉపయోగించవద్దనడం విచిత్రంగా ఉంది. దీని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే బతికున్న వ్యక్తుల పేర్లను పాత్రలకు ఎలాగో పెట్టలేము. ఇంకా అక్కడ ఏమి మిగిలి ఉంది. మన పాత్రలను XYZ, 123, ABC అని పిలవాలా? అని అనురాగ్ ప్రశ్నించారు. పాత్రలకు ఇంటిపేర్లు, డార్క్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న కూడా సమస్యేనని అవి కేవలం ఎటువంటి తప్పు చేయకుండా తెల్లగా ఉండాలని సెన్సార్ కోరుకుంటుదని.. ఇలాంటి సమస్యల కారణంగానే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకుంగా ఆగిపోతున్నాయని అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నైతిక పాఠాలు నేర్పడానికి రూపొందించిన సినిమాలు నిజంగా సమాజాన్ని మార్చలేవని.. నిజాయితీగా కథ చెప్పడం చాలా ముఖ్యమని అనురాగ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం అలాంటి సినిమాలు రావట్లేదని అనురాగ్ తెలిపాడు.
సెన్సార్ బోర్డులో ఉన్న భాషా అడ్డంకులను కూడా అనురాగ్ కశ్యప్ ఎత్తి చూపారు. బోర్డులో ఉన్న చాలా మంది అధికారులకు హిందీ అర్థం కాదు. దీనికి ఉదాహరణ తన మొదటి చిత్రం ‘సత్య’ ఈ సినిమాలో ఒక పదానికి బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే డిక్షనరీ ప్రకారం ఆ పదానికి అర్థం “తెలివితక్కువ” లేదా “బెవాకూఫ్” అని వస్తుంది. దీనికే మరే అర్థం లేదు. కానీ సెన్సార్ బోర్డు మహారాష్ట్రలో ఉండడం, అక్కడ కూర్చున్నవారు హిందీ మాట్లాడేవారు కాకపోవడం వల్ల, ఆ పదం యొక్క ఉచ్చారణ, ధ్వని ఆధారంగా వారు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని కశ్యప్ తెలిపారు. దీంతో నేను వారికి డిక్షనరీ తీసుకువెళ్లి చూపించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఫోన్లను కూడా లోపలికి అనుమతించడం లేదంటూ అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.