Anupama Parameswaran | ‘ఈ టీజర్ చూసినప్పుడు నా పదేళ్ల జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ఇన్నేళ్లలో నా ఫేవరేట్ మూవీ ఇది. నేను పోషించిన సుబ్బు పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’. ‘ఇన్ ది నేమ్ ఆఫ్ లవ్’ ఉపశీర్షిక. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. విజయ్ డొంకడ నిర్మాత. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్ని పోషించారు. బుధవారం చిత్ర టీజర్‌ను మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.
సుబ్బు పాత్ర పరిచయంతో టీజర్ ప్రారంభమైంది. ముగ్గురు స్నేహితురాలు సుదూర యాత్రకు బయలుదేరడం, ఈ ప్రయాణం ఆసాంతం సుబ్బు పరదా ధరించి ఉండటం, ఆ తర్వాత గ్రామంలోని దేవత నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సుబ్బు ధరించే పరదా వెనకున్న రహస్యమేమిటన్నది సస్పెన్స్‌గా మిగిలింది. మహిళా ప్రధాన చిత్రంగా మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. మలయాళ రైట్స్‌ను హీరో దుల్కర్ సల్మాన్ తీసుకున్నాడని, విజయంపై నమ్మకంతో ఉన్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, నిర్మాణ సంస్థ: ఆనంద మీడియా, దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల.