‘రాక్షసుడు’, ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ వంటి చిత్రాలతో కమర్షియల్ సక్సెస్‌తో పాటు నటిగా గుర్తింపు తెచ్చుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనే ఆలోచనతోనే సినిమాలను ఎంచుకుంటానని చెబుతుంటుందీ తార. నటిగానే కాదు గతంలో సహాయ దర్శకురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకుంది. అన్నీ కుదిరితే దర్శకత్వం కూడా చేస్తానని గతంలో వెల్లడించింది అనుపమ. బహుముఖ ప్రజ్ఞ చూపించాలనే ప్రయత్నంలో ఆమె తాజాగా ఓ లఘు చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసింది. ‘ఐ మిస్ యూ’ అనే షార్ట్ ఫిలింకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది అనుపమ. ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైన్లోనూ భాగమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ‘ఈ లఘు చిత్రంలో నేను భాగమయ్యే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నా. ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఎంత ఆనందించానో తెరపై చూస్తున్నప్పుడు కూడా అంతే ఆస్వాదించాను.’ అని ఇన్‌స్టా ద్వారా అనుపమ పేర్కొంది. ప్రస్తుతం ఈ తార సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్కేర్’తో పాటు తమిళ, మలయాళంలో ఒక్కో చిత్రంలో నటిస్తున్నది.