‘శతమానం భవతి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల్ని మెప్పించారు నాయకానాయికలు శర్వానంద్-అనుపమ పరమేశ్వరన్. ఈ జోడీ మరోమారు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నది. సంపత్‌నంది దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కేకే రాధామోహన్ నిర్మాత.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను నాయికగా ఖరారు చేశారు. శనివారం ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘1960 దశకంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగే కథాంశంతో హై ఇంటెన్స్ పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. శర్వానంద్ గత చిత్రాలకు భిన్నంగా పూర్తి మేకోవర్‌తో కనిపిస్తారు.
భారీ వ్యయంతో అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తాం. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.