Anupama Parameswaran | ఈ కేరళ కుట్టిని నిక్కచ్చిగా పొగడాలంటే దేవదాసును మహాకవి కాళిదాసు పూనాల్సిందే! ఉంగరాల్లాంటి ముంగురులు, చక్రాల్లాంటి కండ్లు, గులాబీ రెక్కలను గుర్తుచేసే పెదాలు.. అసలైన సొగసుకు సిసలైన చిరునామాగా కనిపిస్తుంది అనుపమా పరమేశ్వరన్. ‘ప్రేమమ్’ సినిమాతో మొదటిసారి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ చిన్నది ‘టిల్లు స్క్వేర్’తో మరోసారి మతులు పోగొట్టడానికి సిద్ధమవుతున్నది.
నాకు కోపం చాలా ఎక్కువే! ‘అఆ’లో నాగవల్లిలా అన్నమాట. కోపం వస్తే ఫటాఫట్ అనేస్తా. గట్టిగా అరిచేస్తా! కాసేపు అదే మూడ్‌లో ఉంటా. ఇంకొన్నిసార్లు పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోతా. ఓ అరగంటకు మళ్లీ సెట్ అయిపోతా! ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావించను. ‘ఐదేండ్ల కిందట ఫలానా రోజు ఇలా అన్నావు’ అని గతాన్ని తవ్వి తగవులు పెట్టుకోను. ఎప్పటి సంగతులు అప్పుడే క్లియర్ చేసుకుంటా.
నాకు శాకాహారం అంటే ఇష్టం. మాంసాహారం కూడా తింటాను. తినడమే కాదు చక్కగా వండుతాను కూడా! ముఖ్యంగా చేపల సూప్ నేను చేస్తే సూపర్‌గా ఉంటుందని తిన్నవాళ్లు చెప్పిన మాట. అఫ్కోర్స్ నా మాటా అదే అనుకోండి.
‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటారు కదా! నా విషయంలో అది రివర్స్. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో నాది చిన్నపాత్ర. మహా అయితే పదిహేను నిమిషాల నిడివి ఉంటుందేమో! అయితే, ఆ సినిమా విడుదలయ్యాక నా
మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇండస్ట్రీలో అనుభవం లేకపోవడంతో వాటన్నిటినీ చాలా సీరియస్‌గా తీసుకున్నా. చాలా రోజులు డిప్రెషన్లో ఉండిపోయా. ఎంతగా అంటే.. మళ్లీ మలయాళ చిత్రాల్లో నటించొద్దని డిసైడ్ అయిపోయా. తర్వాత రెండేండ్లకు గానీ, మళ్లీ మాతృభాషలో సినిమా చేయలేదు. ఇప్పుడు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లకు సోషల్ మీడియాను ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసుకున్నా. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఇన్‌స్టాలో రెగ్యులర్‌గా వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటాను.
అభిమానులను నేరుగా కలిసే అవకాశం ఉండదు కదా! ఆ లోటును సామాజిక మాధ్యమాలు భర్తీ చేస్తాయి. నా సినిమాలు, నా నటనను మెచ్చుకుంటున్న వారికి నా సంతోషాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా
సరైన వేదిక అనుకుంటున్నా.
ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా ఫిట్‌గా ఉండటం మాత్రమే కాదు. మానసికంగా బలంగా ఉండాలి. మన ఆలోచనలు ఎంత క్లియర్‌గా ఉంటే.. మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగని ఫిట్నెస్ గురించి అస్సలు పట్టించుకోకుండా ఉంటానని కాదు. సరైన డైట్ పాటిస్తాను. రెగ్యులర్‌గా వర్కవుట్లు చేస్తుంటాను. ఇంతకు మించిన ఆరోగ్యసూత్రం ఏదీ లేదు!
తెలుగులో నాకు మంచి అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా ‘అఆ’లో గుర్తుండిపోయే పాత్ర దొరికింది. ‘శతమానం భవతి’ సూపర్ హిట్‌గా నిలిచింది. మూసధోరణి కాకుండా.. ప్రతి సినిమాలో వైవిధ్యం ఉన్న పాత్రలే దక్కాయి. ‘18 పేజెస్’తో నటిగా నాకు మంచి పేరొచ్చింది. ‘కార్తికేయ 2’ సూపర్ హిట్ సంతోషాన్నిచ్చింది. ‘టిల్లు స్క్వేర్’తో మంచి విజయాన్ని అందుకుంటానన్న నమ్మకం ఉంది.
“Anupama Parameswaran | చీరకట్టులో సెగలు పుట్టిస్తున్న అనుపమ పరమేశ్వరన్..”