బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్‌ఖేర్‌కు పుస్తక రచయితగా కూడా మంచి పేరుంది. గతంలో ఆయన రాసిన ‘ది బెస్ట్ థింగ్స్ అబౌట్ యూ’ ‘లెస్సన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ’ ‘యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే’ వంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు పాఠకాదరణ పొందాయి. తాజాగా ఆయన ‘డిఫరెంట్ బట్ నో లెస్’ పేరుతో మరో పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించారు. ఇప్పటివరకు తాను రాసిన పుస్తకాల్లోకెల్లా ఇది చాలా ప్రత్యేకమైనదని, వ్యక్తిగత జీవిత అనుభవాల ఆధారంగా తీర్చిదిద్దానని అనుపమ్‌ఖేర్ తెలిపారు.
మన శక్తియుక్తులపై అచంచల విశ్వాసంతో జీవితపు తుఫానులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ఈ పుస్తకంలో వివరించానని, జీవితంపై ఆశావహదృక్పథాన్ని మరింత రెట్టింపు చేసేలా ఈ రచన ఉంటుందని అనుపమ్‌ఖేర్ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘తన్వి: ది గ్రేట్’ జూలై 18న ప్రేక్షకుల ముందుకురానుంది.