ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి ‘అనూజ’ చిత్రం షార్ట్‌లిస్ట్ అయిన విషయం తెలిసిందే. గునీత్ మోంగా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. గురువారం ప్రకటించిన 2025 ఆస్కార్ పురస్కారాల నామినేషన్ జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ఈ చిత్రానికి అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. 97వ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ దక్కించుకున్న సినిమాల వివరాలను గురువారం వెల్లడించారు. మార్చి 2న లాస్ఏంజిల్స్లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్లో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది.
న్యూఢిల్లీలోని బట్టల మిల్లులో తన సోదరితో కలిసి పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక అనూజ నేపథ్యంలో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోస్తూ బోర్డింగ్ స్కూల్లో విద్యనభ్యసించాలని తపించే అనూజ ఎన్నో అవరోధాలను అధిగమించి తన కలను ఎలా నెరవేర్చుకుందన్నదే ఈ లఘు చిత్ర ఇతివృత్తం. నిర్మాత గునీత్‌మోంగా కపూర్ నిర్మించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రం 2023 ఆస్కార్ పురస్కారాల్లో బెస్ట్ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకోవడ విశేషం. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనూజతో పాటు ఏలియన్, అయామ్ నాట్ ఏ రోబోట్, ది లాస్ట్ రేంజర్, ది మ్యాన్ హూ కుడ్నాట్ రిమైన్ సైలెంట్ అనే చిత్రాలు పోటీలో ఉన్నాయి.
ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం విభాగంలో పది చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. అనోరా, ది బ్రూటలిస్ట్, ఏ కంప్లీట్ అన్నౌన్, కాంక్లేవ్, డ్యూన్-2, ఎమిలియా పెరెజ్, ఏ రియల్ పెయిన్, సింగ్ సింగ్, ది సబ్‌స్టాన్స్, విక్క్డ్ చిత్రాలు రేసులో పోటీపడుతున్నాయి. ఇందులో ‘ఎమిలియా పెరెజ్’ చిత్రం మొత్తం పదమూడు నామినేషన్స్ సాధించి ఆస్కార్ రేసులో అగ్ర భాగాన నిలిచింది. గతంలో ఆల్ ఏబౌట్ ఈవ్ (1950), టైటానిక్ (1997), లా లా లాండ్ (2016) చిత్రాలు పద్నాలుగు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకొని రికార్డు సృష్టించాయి. ఇప్పుడు 13 నామినేషన్స్‌తో ‘ఎమిలియా పెరెజ్’ వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని అమెరికన్ ఫ్రెంచ్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కించారు. జాక్వీయస్ ఆడియార్డ్ దర్శకత్వం వహించారు.