Pawan Kalyan | అమెరికాలో పుట్టి పెరిగిన టాలెంటెడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి పెంచుకుని, స్వప్న సంచారి అనే మలయాళ చిత్రంలో బాలనటిగా తొలి అడుగు వేసింది. ఆ తర్వాత యాక్షన్ హీరో బిజు ద్వారా కథానాయికగా పరిచయమై, తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. కొద్ది కాలంలోనే తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి మజ్నుతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సహజమైన నటనతో, మెరిసే అందంతో అను మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలజా రెడ్డి అల్లుడు, గీత గోవిందం, అల్లుడు అదుర్స్, రావణాసుర వంటి సినిమాల ద్వారా పలకరించింది.
అయితే కొంతకాలంగా అను పెద్దగా కనిపించలేదు. తాజాగా రష్మిక మందన్నాతో కలిసి నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంతో మళ్లీ తెరపైకి వచ్చి, కీలక పాత్రలో మెప్పించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అను, తన కెరీర్ గురించి స్పష్టంగా చెప్పింది. “ఇకపై రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. అవకాశాల కోసం ఆరాటపడే తత్వం నాది కాదు. నాకు సంతృప్తినిచ్చే, బలమైన పాత్రలతో కూడిన సినిమాలే చేయాలనుకుంటున్నాను” అని అను పేర్కొంది. హాలీవుడ్ సినిమాలను ఉదహరిస్తూ, అక్కడ హీరో, హీరోయిన్, విలన్ అనే విభజన ఉండదు. ప్రతి పాత్రకీ కథలో ప్రాధాన్యం ఉంటుంది. ది గర్ల్ఫ్రెండ్లో కూడా రాహుల్ రవీంద్రన్ అదే ప్రయత్నం చేశారు. థియేటర్లో మహిళా పాత్రలకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది అని అను చెప్పింది.
మహిళలపై సమాజం విధించే షరతులను ప్రస్తావిస్తూ, “ఎలా మాట్లాడాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి ఇవన్నీ మహిళలకే. కానీ పురుషులకు మాత్రం అలాంటి ఆంక్షలు ఉండవు. ఇది మారాల్సిన సమయం” అని ఆవేదన వ్యక్తం చేసింది. నా సినీ ప్రయాణం పట్ల కొంత అసంతృప్తి ఉన్నా, నటిగా మాత్రం సంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, కార్తి, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో పని చేసే అవకాశం దక్కింది. కానీ కొన్ని సినిమాలు చేయకపోయి ఉంటే బాగుండేమో అని ఇప్పుడు అనిపిస్తుంది” అని అను పేర్కొంది. ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్‌లతో కూడిన కథలు వింటున్నానని, వాటిలో ఒక ప్రాజెక్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందని, వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.