‘ఓ స్వచ్ఛమైన ప్రేమకథను చెప్పాలనుకున్నా. అందుకే ఈ సినిమాకు 80వ దశకం నేపథ్యాన్ని ఎంచుకున్నా’ అని చెప్పారు చెందు ముద్దు. ఆయన దర్శకత్వంలో చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ‘నా సినిమాలోని పాత్రలు చాలా స్వచ్ఛంగా, అమాయకంగా కనిపిస్తాయి. అందుకే 80ల నాటి నేపథ్యాన్ని తీసుకున్నా. నేటి ఆధునిక యుగంలో ప్రేమను వ్యక్తపరిచే విధానం మారింది. అందుకే పాత కాలంలోకి తీసుకెళ్లి కథను చెప్పాను. 80నాటి నేపథ్యమే ఈ కథకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ సినిమాలో హీరో అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. అదే పేరుతో హీరో ఊరిలో ఫొటో స్టూడియో పెట్టుకొని జీవితాన్ని సాగిస్తుంటాడు. ఆయన ప్రేమ ప్రయాణంలో జరిగిన సంఘటనలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ పూర్తి వినోదాత్మక చిత్రం. ఎక్కడా అశ్లీలత ఉండదు. సంభాషణలన్నీ క్లీన్గా ఉంటాయి. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకొని బయటికొస్తారు. హీరో చైతన్యరావులో వింటేజ్ లుక్ కనిపిస్తుంది. అందుకే ఆయన్ని సినిమాకు హీరోగా ఎంచుకున్నాం. నాటి నేపథ్యాన్ని రీక్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. అయితే అవుట్పుట్ చూసి టీమ్ అంతా సంతోషంగా ఫీలయ్యాం. ఈ సినిమాలో నిర్మాత యష్ రంగినేనిగారు ఓ కీలక పాత్రను పోషించారు. ఆయన పాత్ర కూడా అందరికి గుర్తుండిపోతుంది’ అన్నారు.