Anna lezhneva | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు… కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె శ్రీ వారికి మొక్కులు చెల్లించుకున్నట్టు తెలుస్తుంది. టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో స్వాగతం పలికారు.. దర్శనం అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆమె మొదట శ్రీభూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు.
ఆ తర్వాత శ్రీపద్మావతి విచారణ కేంద్రం దగ్గర కళ్యాణకట్ట తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కావడంతో, హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని డిక్లరేషన్ పై సంతకం చేశారు. తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె గాయత్రీ నిలయంలో ఆదివారం రాత్రి బస చేశారు. అయితే తన తనయుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం బారిన పడగా, ఆ సమయంలోనే అన్నా తిరుమల స్వామి వారిని మొక్కుకున్నారట. క్షేమంగా మార్క్ శంకర్ బయటపడిన నేపథ్యంలో మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చేతులకి, కాళ్లకి గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తులలోకి వెళ్లడంతో మూడు రోజుల పాటూ మార్క్ శంకర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత కోలుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. పవన్ తన భార్య అన్నా లెజినోవా, కూతురు పొలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్‌తో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. తన తనయుడు కోలుకోవాలని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, జనసేన సభ్యులు, అభిమానులు, కుటుంబసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్