సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘వేట్టెయాన్’ దసరాకు ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దక్షిణాదిన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
కమర్షియల్ పంథాకు భిన్నంగా సామాజికాంశాలను చర్చిస్తూ దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, ‘జై భీమ్’ తరహాలో సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా ఇదని అన్నారు. ‘ఈ కథ నన్ను ఆలోచింపజేసింది. సమకాలీన అంశాలను తనదైన శైలిలో చర్చిస్తూ వాటికి పరిష్కార మార్గాల్ని సూచిస్తూ దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు.
రజనీకాంత్ కెరీర్లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలకు దూరంగా ఓ బలమైన సందేశాన్ని అందించే ఉద్దేశ్యంతో రజనీకాంత్ ఈ సినిమాలో నటించారు’ అని చెప్పారు. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.