Anirudh-Kavya | కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఈ జంట రిలేషన్‌పై పలు వార్తలు వెలువడ్డా, తాజాగా ఓ వైరల్ వీడియోతో ఈ గాసిప్స్‌కి మళ్లీ బలం చేకూరింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో అనిరుధ్, కావ్య మారన్ ఇద్దరూ న్యూయార్క్ వీధుల్లో కలిసి షికార్లు చేస్తూ కనిపించారు. ఓ అమెరికన్ యూట్యూబర్ తీసిన వీడియోలో అనుకోకుండా వీరిద్దరూ కనిపించడంతో, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు “సీక్రెట్ లవర్స్ దొరికేశారు!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే, కొలీవుడ్ సర్కిల్లో వీరి పెళ్లి వచ్చే ఏడాదిలోనే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరువురు కుటుంబాలకీ ఈ రిలేషన్ గురించి తెలిసినట్టు, పెద్దల అంగీకారంతోనే పెళ్లి జరగబోతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలపై అనిరుధ్ టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. “వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిరుధ్ దక్షిణాదిలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ధనుష్ త్రీ సినిమాతో కెరీర్ ప్రారంభించి, తక్కువ కాలంలోనే టాప్ స్థాయికి చేరుకున్నాడు. ఒక్కో సినిమాకు సుమారు ₹15 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం తమిళంలో దళపతి విజయ్ ‘జననాయకన్’, లోకేష్ కనగరాజ్ ‘డీసీ’, తెలుగులో నాని ‘ది ప్యారడైజ్’, ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు కావ్య మారన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమానురాలు, చైర్మన్‌గా ఉన్నారు. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండగా, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆమె కనిపించే ప్రతి సారి ఫ్యాన్స్ ప్రత్యేకంగా ట్రెండ్ చేస్తుంటారు. కాగా, వైరల్ వీడియోతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారిన అనిరుధ్–కావ్య మారన్ జంట, పెళ్లి వార్తలపై ఏమైన స్పందిస్తారా అన్నది చూడాలి.