బహుజన చక్రవర్తిగా కీర్తిగడించిన చారిత్రక యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథ ఆధారంగా రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆర్కే ఫిలింస్ ద్వారా నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ‘సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం.
పేద ప్రజల పక్షాన పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. 30కోటలను జయించిన ధీరుడాయన. నేటి తరానికి ఆయన చరిత్రను తెలియజెప్పే చిత్రమిది’ అన్నారు. అద్భుత గ్రాఫిక్ హంగులతో ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే చిత్రమిదని దర్శకనిర్మాత వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, రచయిత పొన్నం రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.