అగ్ర నటుడు చిరంజీవి వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. ఇటీవల ఆయన జన్మదినం సందర్భంగా రెండు చిత్రాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న 157వ చిత్రమిది. గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి తనయ సుస్మిత ఓ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఈ రెండు ప్రాజెక్ట్స్‌లతో పాటు చిరంజీవి మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రానికి ఓకే చేశారని సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలి వినోదం, యాక్షన్ అంశాల కలబోతగా చెప్పిన కథ బాగా నచ్చడంతో చిరంజీవి వెంటనే అంగీకరించారని చెబుతున్నారు. ఇటీవల ప్రకటించిన రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబో సెట్స్‌మీదకు వెళ్తుందని సమాచారం.