Anil Ravipudi | టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే దర్శకుడు అనీల్ రావిపూడి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు ప్రత్యేకమైన స్టైల్‌ను తీసుకొచ్చిన ఆయన, వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈసారి ఆయన ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం అనిల్ రావిపూడి తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా కడుపుబ్బ నవ్వించే కామెడీతో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌ను సమతుల్యంగా మేళవించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్‌కు సూట్ అయ్యే ఫ్యామిలీ కామెడీ ట్రాక్, కల్యాణ్ రామ్‌కు సరిపోయే యాక్షన్ షేడ్స్ ..ఈ రెండింటి మేళవింపుతో కథను డిజైన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన హీరోయిన్ల ఎంపికపై కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ దాదాపు ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్, పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడం తెలిసిందే.
మరోవైపు, కళ్యాణ్ రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, ఇటీవల ప్లాపులతో ఇబ్బంది పడుతున్న కృతి శెట్టికి ఇది మంచి అవకాశంగా మారనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ చిత్రాన్ని విడుదల చేయాలన్న ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి గత ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ ప్రాజెక్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వెంకటేష్ కామెడీ టైమింగ్, కల్యాణ్ రామ్ యాక్షన్ స్టైల్, అనిల్ రావిపూడి టేకింగ్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అధికారికంగా పూర్తి క్యాస్ట్, టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటించే వరకు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగే అవకాశముంది.