Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌గా నిలిచింది. ఇదే కాకుండా, చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలవడం విశేషం. ఇలాంటి సంచలన విజయానికి కారకుడైన దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి నుంచి అదిరిపోయే గిఫ్ట్ లభించింది. సినిమా ఘనవిజయాన్ని పురస్కరించుకుని, చిరు అనిల్ రావిపూడికి అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహుమతిగా అందించారు.
ఈ మెగా గిఫ్ట్ అందుకున్న సందర్భంగా అనిల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. కారు గిఫ్ట్ అందజేసే వేళ చిరంజీవి అనిల్‌కు కొన్ని హితబోధలు చేశారు. అనిల్ స్వయంగా కారు డ్రైవ్ చేస్తానని చెప్పగానే, కారు కీస్ అందజేస్తూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి, సేఫ్టీ ఎంతో ముఖ్యం, చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి అంటూ చిరు సూచనలు ఇచ్చారు. మెగాస్టార్ మాటల్లోని ఆప్యాయత, బాధ్యత అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సరదాగా, “కారు నచ్చిందా?” అని అడగ్గా… అనిల్ రావిపూడి వెంటనే సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను గుర్తు చేస్తూ, “నచ్చడం ఏంటి సార్… మెగా బహుమతి మహదానందం, మనోధైర్యం, ధనాధన్!” అని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచేశారు. ఆ క్షణాలు అక్కడున్నవారిని మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలోనూ ఫుల్ వైరల్ అయ్యాయి.
‘హిట్ మెషీన్‌కు మెగా గిఫ్ట్’ అంటూ చిత్రబృందం ఈ ఘట్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా… అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విజయోత్సాహం ఇంకా కొనసాగుతుండటంతో, చిరు–అనిల్ కాంబినేషన్‌పై భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందంటూ నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.