Venkatesh | ‘మంచి హిట్ సినిమా చేస్తున్నామని అనుకున్నాం..కానీ మీరందరూ ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. ఎక్కడకు వెళ్లినా అందరూ అద్భుతమైన ప్రేమను చూపిస్తున్నారు’ అని అన్నారు అగ్ర నటుడు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ..
‘ఈ సినిమాకు రెండొందలు, మూడొందల కలెక్షన్స్ అని చెబుతున్నారు. ఇవన్నీ మీరిచ్చినవే. మీ ప్రేమ ఇలాగే ఉంటే మళ్లీ సంక్రాంతికి వస్తాం. మరో బ్లాక్‌బస్టర్ కొడతాం’ అన్నారు. తాను వెంకటేష్‌కు అభిమానినని, ఆయన సినిమాకు విజిల్స్ వేశానని, ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. టీమ్ అందరి సమిష్టికృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని నిర్మాత శిరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయికలు ఐశ్వర్యరాజేష్, మీనాక్షి చౌదరి, సంగీత దర్శకుడు భీమ్స్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.