Andhra king taluka | థియేటర్లలో ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయిన కొన్ని సినిమాలు, ఓటీటీ వేదికపై మాత్రం ఊహించని స్థాయిలో ఆదరణ పొందుతుంటాయి. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్న సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ఓటీటీకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంటోంది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో, రామ్ – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పలేదు. దీంతో నెల తిరగకుండానే సినిమా ఓటీటీ బాట పట్టింది.
డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి డిజిటల్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా… ఓ వీరాభిమాని జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన కథతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “థియేటర్లలో మిస్ అయ్యాం కానీ, ఓటీటీలో చూసాక చాలా నచ్చింది”, “2025లో వచ్చిన అండర్రేటెడ్ సినిమాల్లో ఇది ఒకటి” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇదే సమయంలో మరో భారీ చిత్రం కూడా ఓటీటీకి చేరింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ & ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ను కలిపి రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్’. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ స్పెషల్ వెర్షన్ రూ.53 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 8 వారాల గ్యాప్ తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే ఇది కేవలం హిందీ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక హిందీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను “మాస్టర్‌పీస్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మరి ‘బాహుబలి: ది ఎపిక్’ తెలుగు, ఇతర భాషల వెర్షన్లు ఎప్పుడు, ఏ ఓటీటీలో వస్తాయన్నదానిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అప్పటివరకు ఓటీటీ ప్రేక్షకుల దృష్టి మాత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై నిలిచినట్టే కనిపిస్తోంది.