‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కోసం చిత్ర కథానాయకుడు రామ్ ‘నువ్వుంటే చాలే..’ అనే ఓ పాటను రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ గీతం శ్రోతల్ని అలరిస్తున్నది. సోమవారం ఈ చిత్రంలోని రెండో గీతం ‘పప్పీ షేమ్..’ను రిలీజ్ చేశారు. ఈ పాటను హీరో రామ్ ఆలపించడం విశేషం. వివేక్ అండ్ మెర్విన్ స్వరపరచిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. ఎనర్జిటిక్ బీట్తో యూత్‌ని ఆకట్టుకునేలా ఈ పాట సాగింది.
ఈ సినిమాలో హీరో రామ్.. ఓ సినీ హీరో అభిమాని పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. తన అభిమాన హీరో సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ, పందెం ఓడిపోయిన యాంటీ ఫ్యాన్స్‌ను ట్రోల్ చేస్తున్నట్లుగా ‘పప్పీ షేమ్’ గీతం సాగింది. రామ్ తన గ్యాంగ్‌తో సెలబ్రేషన్ మోడ్‌లో కనిపించారు. ఈ సినిమా నవంబర్ 28న విడుదలకానుంది. భాగ్యశ్రీబోర్సే, ఉపేంద్ర, రావు రమేష్, మురళీశర్మ, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ అండ్ మెర్విన్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు.పి.