Anchor Ravi | టెలివిజన్ షోలతో పాటు యూట్యూబ్ వీడియోలు, ఈవెంట్లతో బిజీగా ఉండే యాంకర్ రవి, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన సినీ ప్రయాణం గురించి, మెగాస్టార్ చిరంజీవి గారితో తనకు జరిగిన ఓ మరిచిపోలేని సంఘటనను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి గురి అయ్యాడు. రవి తొలి చిత్రం ఇది మా ప్రేమ కథ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న టైమ్‌లో చిరంజీవి గారు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఆయన్ను కలసి నా సినిమా టీజర్‌ను లాంచ్ చేయమని అడగాలి అనుకున్నా. అయితే అప్పటివరకు ఆయన్ని వ్యక్తిగతంగా కలవలేదు.
మాటీవీ నెట్వర్క్ వాళ్లకు ఒకసారి చిరంజీవి గారిని కలిపించమని అడగ్గా .. ‘చిరంజీవి గారు స్వయంగా పిలిస్తేనే కలవచ్చు’ అన్నారు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ అయిపోయేవరకు అక్కడే ఎదురుచూశాను. అప్పటివరకు దేవుడ్ని దండం పెట్టుకున్నా.. ఒక్కసారి చిరంజీవి గారు నా టీజర్ లాంచ్ చేస్తే చాలు’ అని. ఎందుకంటే నాకు దేవుడంటే చిరంజీవి గారే. షూట్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తుండగా, ఆయన ఎదురుగా 20 మంది వరకు ఉన్నాం. చిరంజీవి గారు నన్ను దాటి వెళ్లారు. అయితే, మళ్లీ వెనక్కి వచ్చి – ‘మీరేంటి ఇక్కడ?’ అని అడిగారు. ఆ మాట విన్న వెంటనే షాక్ అయ్యా ,ఆయనకు నేను తెలుసా? అని అనుకున్నా.
సర్, రెండు నిమిషాలు మాట్లాడాలని కోరాను. వెంటనే నన్ను పిలిపించారు. నా జన్మ సార్థకం అనిపించింది. లోపలికి వెళ్లి, నా టీజర్ గురించి చెప్పాను. ఆయన ఎంతో అపురూపంగా స్పందించారు. ఎక్కడికి రావాలి అని అడిగారు. ‘ఎక్కడికీ రావలసిన పని లేదు సర్.. ల్యాప్ టాప్‌లో చేస్తే చాలు అన్నాను. టీజర్ చూసిన తర్వాత, డైరెక్టర్‌తో కూడా మాట్లాడి, ఒక బైట్ కూడా ఇచ్చారు. మీ లాంటి యంగ్ బ్లడ్ రావాలి, ఏదైనా అవసరం ఉంటే చెప్పు. సినిమా పూర్తయ్యాక చూపించు అని చిరంజీవి అన్నారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే సినిమా రిలీజ్ తర్వాత ఆయనను కలవలేదు. రెండేళ్ల తర్వాత జీ తెలుగు అవార్డుల వేడుకలో ఆయన్ను మళ్లీ కలిసాను. అప్పుడు ‘నువ్వు ఇంకా నీ సినిమా చూపించలేదే కదా?’ అని అడిగారు.నన్ను, నా సినిమాను గుర్తుంచుకుని అడగడం చూసి నోట మాట రాలేదు. ‘ఫ్లాప్ అయింది సర్… ఎలా చూపించాలో అర్థం కాలేదు’ అన్నా.సినిమా సినిమానే… ఫలితం ఎలా ఉన్నా, నీవు కష్టపడ్డావు కదా అని అన్నారు. చిరంజీవి గారి ప్రేమ నిజంగా స్వచ్ఛమైనది. నా బాడీ కాలేంత వరకు నేను ఆయన అభిమానినే అని రవి చెప్పుకొచ్చాడు.