7/G Brindavan Colony Sequel | తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ప్రేమ కథాంశాలతో సినిమాలు వచ్చాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కలచివేశాయి. అలాంటి చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 7/G బృందావన్ కాలనీ. ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు యుగానికి ఒక్కడు సినిమాతో గుర్తింపు పొందిన సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇందులో రవి కృష్ణ మరియు సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
7/G బృందావన కాలనీ 2 పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సీక్వెల్‌కు కూడా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమాలో కథానాయిక రోల్‌కి సంబంధించి ఒక వార్త వైరల్‌గా మారింది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్గా లవ్ టుడే ఫేమ్ ఇవానా, శంకర్ కూతురు అదితి శంకర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో మరో కథానాయిక పేరు వినిపిస్తుంది. మలయాళ సినిమా రేఖచిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నటి అనస్వరరాజన్ (AnaswaraRajan) 7/G బృందావన కాలనీ 2లో హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.