తెలుగు సినిమాలో ప్రతీది గ్రాండ్గా ఉంటుందని, ఇక్కడ ఒకసారి పనిచేస్తే మళ్లీమళ్లీ తెలుగు సినిమాలే చేయాలనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేసింది మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్. మలయాళంలో రేఖాచిత్రం, నెరు, సూపర్శరణ్య వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ‘ఛాంపియన్’ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం అనస్వర రాజన్ విలేకరులతో ముచ్చటించింది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు చాలా ఎమోషనల్గా ఫీలయ్యాను. ఇందులో నేను చంద్రకళ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్ ప్రతీ ఒక్కరి హృదయంలో నిలిచిపోతుంది. నాకు వింటేజ్ పీరియడ్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆ కాలంలోకి వెళ్లిన అనుభూతిని పొందడంతో పాటు అప్పటి కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు. నా మలయాళ చిత్రాల్ని చూసిన ఎంతో మంది తెలుగువారు నా నటనను మెచ్చుకుంటూ మెసేజ్లు పెట్టేవారు. నిజంగా తెలుగు ప్రేక్షకులది గొప్ప మనసు’ అని చెప్పింది.