Anasuya | స్టార్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ఇటీవల హైదరాబాద్లో ఓ లగ్జరీ ఇంట్లో గృహ ప్రవేశం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి కొత్తింట్లో దిగిన ఫొటోలని కూడా షేర్ చేసింది. ఇంట్లో శుభకార్యం కావడంతో అనసూయ పూర్తిగా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. పూజలు, వ్రతంతో పాటు హోమాలు కూడా నిర్వహించారు. అయితే అనసూయ తాజాగా తన ఇన్స్టాలో మా ఇంటికి హనుమంతుడు వచ్చారు అని పేర్కొంది. తమ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. అనసూయ ఇలా రాసుకొచ్చింది.
ఈ నెల 3వ తేదీన మేము మా కొత్త ఇంట్లో కొన్నిహోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరుపుకున్నాం. చాలా కార్యాలు ఉండటం వల్ల మొదట హోమం మొదలుపెట్టే ముందు మా గురువు గారితో నేను చెప్పాను.. ఇంటికి ‘సంజీవని’ అనే పేరు పెట్టాలనుకుంటున్నాం గురువు గారని.. ఆయన ఒక 30 సెకన్లు అలా కళ్లు మూసుకొని ఆ తర్వాత ‘శ్రీరామ సంజీవని’ అని పెట్టు అన్నారు. నేను మా ఆయన చాలా ఆనందపడి చాలా బావుంది గురువు గారు సరే అండి అని.. వాస్తు పురుషులు, ఆయన ధర్మపత్ని పూజ చేయటాకిని అటు పక్కకి వెళ్లాము.. గురువు గారు హోమం కొనసాగించారు. ఒక 20 నిమిషాలు దాటిన తర్వాత ఇంతలో మా గురువు గారు వచ్చి తన ఫోన్ చూపించారు ఇలా అంటూ.. ‘అనసూయ.. ఆంజనేయుడు వచ్చాడు’ అని.. అంతే
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న గారు.. అంటే మా పాపాజీ నుంచి నేర్చుకున్న మొదటి గొప్ప విషయం.. సంతోషంలో, దుఃఖంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో అన్నింటిలో జై హనుమాన్ అని తలుచుకోకుండా ఏమీ చేయలేను నేను.. నా తండ్రి తర్వాత ఆ హనుమంతుడ్నే నా తండ్రిగా భావిస్తానని నా దగ్గరి వాళ్లందరికీ తెలుసు.. నా పెద్ద కొడుకుకి శౌర్య అని ఆయన పేరే పెట్టుకున్నాం. అగ్ని దేవుడు ముక్కోటి దేవతలకి వార్తాహరుడు (మెసెంజర్) అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైనా గట్టిగా చెప్పుకోవాలనుకున్నా హోమం ద్వారానే చెప్పుకుంటాం.. ఈ విధంగా ఆ రోజు నా హనుమంతుడు మా ఇంటి పేరుని మా ఇంటిని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. అందరూ ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని నాకు అనిపించింది.. మీలో కొందరు నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రహ్లాదుడు చెప్పినట్లు.. ఇందుగలడందులేడని. సందేహము వలదు.. ఎందెందు వెదకి చూసినా అందందేగలడు అంటూ అనసూయ పలు హ్యాష్ ట్యాగ్లు కూడా జోడించింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.