Anasuya | ఇటీవల మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలతో శివాజీ పేరు నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. శివాజీపై నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందిండం, ఆ సమయంలో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసి, “శివాజీ vs అనసూయ”గా మారిపోయింది. సినీ వర్గాలు, నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘దండోరా’ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ, మహిళలు నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, శరీరం కనిపించేలా దుస్తులు ధరించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, అలాంటి దుస్తులు వేసుకునే వారిపై ప్రజలు బయట నవ్వినా, లోపల మాత్రం విమర్శిస్తారని చెప్పడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఈ వ్యాఖ్యలపై అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందిస్తూ, మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత ఎంపిక అని స్పష్టం చేశారు. అసలు సమస్య దుస్తుల్లో లేదని, పురుషుల ఆలోచనా విధానం, మహిళల పట్ల ప్రవర్తనలో ఉందని ఆమె పేర్కొన్నారు. ఆమె అభిప్రాయానికి అనేక మంది సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. గత కొన్ని రోజులుగా ఈ వివాదం తగ్గుముఖం పట్టింది. అయితే తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఓ వీడియో కారణంగా ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఆమె సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని తన భర్తతో కలిసి కనిపించింది.
ఈ వీడియోను ఓ న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ” అంటూ క్యాప్షన్ ఇవ్వడం మరోసారి చర్చకు దారితీసింది. ఈ పోస్టుపై అనసూయ తనదైన శైలిలో స్పందిస్తూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. “తప్పు తప్పు.. ‘శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ’ అని కదా హెడ్డింగ్ ఉండాలి. ఎందుకంటే అంతకుముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె కామెంట్ సెక్షన్‌ను లాక్ చేయడంతో నెటిజన్లు స్పందించే అవకాశం లేకుండా పోయింది. అనసూయ తాజా స్పందనతో ఈ వివాదం మళ్లీ వార్తల్లో నిలిచింది. శివాజీ చేసిన వ్యాఖ్యలు, వాటిపై జరిగిన వాదోపవాదాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలపై ఈ వివాదం మరింత విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.