Anasuya | సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నెట్టింట తనపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌కు తరచూ దీటుగా స్పందించే అనసూయ.. తాజాగా భారతీయ సంప్రదాయాలు, మహిళల అలంకరణలు, వితంతువులు పాటించే ఆచారాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. తన తల్లి వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ అనసూయ పంచుకున్న భావోద్వేగ వీడియో ఒకవైపు పలువురిని ఆలోచింపజేస్తుండగా.. మరోవైపు ఆమె వ్యాఖ్యలపై విమర్శలు, ట్రోలింగ్ కూడా కొనసాగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అనసూయ తన తల్లి గురించి భావోద్వేగంగా మాట్లాడారు. గతంలో తన తల్లి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుట బొట్టు ధరించి, తలలో పూలు పెట్టుకుని ఎంతో నిండుగా, అందంగా కనిపించేదని గుర్తుచేసుకున్నారు.
అయితే మూడేళ్ల క్రితం తన తండ్రి మరణించిన తర్వాత తల్లి ఈ అలంకరణలన్నింటికీ దూరమవడం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మలు ఆడపిల్లలకు గాజులు, గజ్జెలు, కాటుక, గోరింటాకు వంటి అలంకరణలను పరిచయం చేస్తారని అనసూయ అన్నారు. అలాంటి అలంకరణలను ఒక మహిళ వ్యక్తిత్వం, ఇష్టం కంటే ఆమె వైవాహిక జీవితంతో ఎందుకు ముడిపెడతారని ప్రశ్నించారు. మహిళలు ఇష్టపడే కట్టు, బొట్టు, గాజులు, పూలు వంటి అలంకరణలను భర్త జీవించి ఉన్నాడా లేదా అనే అంశంతో ఎందుకు అనుసంధానిస్తారని అనసూయ తన వీడియోలో ప్రశ్నించారు. పుట్టుకతోనే మహిళలకు అలవాటైన కొన్ని అలంకరణలను పెళ్లి తర్వాత సంప్రదాయాల పేరుతో భర్తకు ముడిపెట్టడం, భర్త మరణించిన తర్వాత వాటిని దూరం చేయడం తనకు బాధ కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒకవేళ జీవితంలో అలాంటి అలంకరణలను తీసేయాల్సిన పరిస్థితి వస్తే.. భర్త మరణంతోనే ఎందుకు ఆ నిర్ణయం ఉండాలని, ఆ సంప్రదాయాల వెనుక ఉన్న కారణాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందనే కోణంలో అనసూయ తన భావాలను వ్యక్తం చేశారు. అయితే అనసూయ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ప్రశ్నల్లో ఆలోచించాల్సిన అంశం ఉందని మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా భర్త బతికున్నప్పటికీ బొట్టు లేకుండా కనిపించే అనసూయ.. ఇప్పుడు బొట్టు, గాజుల గురించి ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె షేర్ చేసిన వీడియోలో కూడా నుదుట బొట్టు లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ కామెంట్లు చేస్తున్నారు.