Sunrisers Hyderabad vs Rajasthan Royals | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 200 పరుగుల వద్దే పరిమితమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరాగ్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి. చివరలో పొవెల్ రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. చివరి బంతికి ఎల్బీడబ్ల్యూ కావడంతో ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్‌కు టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరైంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మద్దతు తెలుపుతూ.. సన్‌రైజర్స్ జెండా పట్టుకుని ఊపుతూ ఆటగాళ్లను ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. వాట్ ఏ మ్యాచ్..స్టేడియంలో మ్యాచ్ చూడడం ఇదే తొలిసారి. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేశారు. ఏంటీ క్లైమాక్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలాగే దూసుకువెళ్లాలి. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, టీమ్ రాజస్థాన్ రాయల్స్ చాలా చక్కగా ఆడారు అంటూ తెలిపింది.