అంచనాలకు మించి పెళ్లి వేడుకలు నిర్వహించడం.. అంబానీల ఆనవాయితీ! అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ సంబురం ముగిసి అప్పుడే మూడు నెలలు కావస్తున్నది. అయినా.. ఆ వేడుక గురించి ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతూనే ఉన్నది. తాజాగా.. ఈ పెళ్లికి హాజరైన బాలీవుడ్ ప్రముఖుల గురించిన ఓ వార్త తెగ వైరల్ అవుతున్నది.
అంబానీ ఆతిథ్యం స్వీకరించడానికి, వారి పెళ్లి బరాత్‌తో స్టెప్పులేయడానికి కొందరు బాలీవుడ్ తారలు పెద్ద మొత్తంలో డబ్బులు పుచ్చుకున్నారన్నది ఆ వార్త సారాంశం. అయితే.. ఈ అంశంపై బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సోషల్‌మీడియా వేదికగా స్పందించింది. అనంత్‌తోపాటు రాధికా మర్చంట్ కూడా తనకు ఎంతో ప్రియమైన స్నేహితులనీ, అందుకే.. ఆ హైప్రొఫైల్ పెళ్లికి హాజరయ్యాననీ చెప్పుకొచ్చింది. అంబానీ పెళ్లి బరాత్‌లో పలువురు సెలెబ్రిటీలతో కలిసి అనన్య స్టెప్పులేసింది.
రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్‌తో కలిసి డ్యాన్స్‌లతో అలరించింది. తాజా పుకార్లపై స్పందిస్తూ.. “ఆ దంపతులిద్దరూ నా స్నేహితులు. సహజంగానే.. నా స్నేహితుల పెళ్లిలో నేను డ్యాన్స్ చేస్తాను. నా ప్రేమను ఇలా పంచుకోవడం నాకు ఇష్టం!” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య పాండే నటించిన వెబ్‌సిరీస్ ‘కాల్ మీ బే’.. రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది.