8 vasanthalu | ‘మ్యాడ్’ చిత్రం ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అనంతిక సనీల్ కుమార్. ప్రస్తుతం ఈ భామ ‘8 వసంతాలు’ అనే వినూత్న కథా చిత్రంలో నటిస్తున్నది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనంతిక..శుద్ధి అయోధ్య అనే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఆమె తన ప్రేమకథను చెబుతున్న సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.
ప్రేమ, ఎడబాటు, వేదన ప్రధానాంశాలుగా చక్కటి పొయెటిక్ ఫీల్‌తో సినిమాను రూపొందించారని టీజర్ చూస్తే అర్థమవుతున్నది. ‘ఎవరి తుపాన్లు వారికి ఉంటాయి లోపల. కొందరు బయటపడతారు. ఇంకొందరు ఎప్పటికీ పడరు’ అంటూ టీజర్ చివరలో కథానాయిక చెప్పిన డైలాగ్ హార్ట్‌టచింగ్‌గా అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, రచన-దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి.