‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది అనంతిక సనీల్‌కుమార్. ఈ భామకు నృత్యంతో పాటు బ్లాక్‌బెల్ట్‌లో కూడా ప్రవేశం ఉండటం విశేషం. ఆమె ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘8వసంతాలు’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. ఈ సందర్భంగా శనివారం అనంతిక విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ సినిమాలో తాను శుద్ధి అయోగ్య అనే రచయిత పాత్రలో కనిపిస్తానని, తనకు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుందని చెప్పింది. ‘స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. ఓ అందమైన ప్రేమకథా చిత్రం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో కుదిరింది. ఈ కథ విన్నప్పుడే భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా.
నేను కోరుకున్న ప్రతీ అంశం ఈ కథలో ఉంది. ప్రేక్షకులకు ఓ జీవితాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా కోసం నేను కళరి అనే ఫైట్ కూడా నేర్చుకున్నా’ అని అనంతిక తెలిపింది. రాజకీయ నాయకురాలు కావాలన్నది తన ఆశయమని, అందుకే న్యాయ విద్యను అభ్యసిస్తున్నానని, అయితే తనకు 40 ఏళ్లు వచ్చాకే పాలిటిక్స్‌లోకి అడుగుపెడతానని నవ్వుతూ సమాధానమిచ్చిందీ భామ.