‘నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ. అందుకే చుట్టూవున్న వాళ్ల దగ్గర నుంచి తీసుకుంటూ వుంటా. ‘బేబీ’ చేసేటప్పుడు ‘సినిమా ఎలా వస్తుంది?’ అని సాయిరాజేశ్, ఎస్కేఎన్, మారుతిగార్లకు పదే పదే కాల్చేసి అడిగేవాడ్ని. ‘నువ్వు చేస్తున్న సినిమా సాధారణమైనది కాదు.. ఈ సినిమాతో నీ కెరీర్ మారిపోతుంది’ అని ఓరోజు మారుతి చెప్పారు. ఆయన అన్నదే జరిగింది.
ఈ సినిమా విషయంలోనూ అలాగే దర్శకుడు ఉదయ్‌ని పదేపదే ఫోన్లు చేసి విసిగించేవాడ్ని. నిన్న సంబంధంలేని కొందరు యూత్‌కి ‘గం గం గణేశా..’ స్పెషల్ షో వేసి చూపించాం. వాళ్లంతా సూపర్‌గా ఎంజాయ్ చేశారు. అప్పుడు నమ్మకం కుదిరింది. ఈ సమ్మర్‌కు సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం గం గణేశా..’ అన్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా రూపొందిన ఈ చిత్రానికి ఉదయ్‌శెట్టి దర్శకుడు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు.
ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో ఆనంద్ దేవరకొండ మాట్లాడారు. అతిథిగా విచ్చేసిన రష్మిక మందన్నా మాట్లాడుతూ ‘ఆనంద్ నాకు ఒక బ్రదర్. తనకి తెలీదు.. తనపై నేను చాలా డిపెండ్ అవుతుంటా. ఈ సినిమా సక్సెస్ అయితే ఆనంద్ మొహంలో నవ్వు ఉంటుంది.
ఆ నవ్వే నేను కోరుకునేది. అందుకే ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలి’ అని ఆశాభావం వెలిబుచ్చింది. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతోపాటు నిర్మాత బన్నీవాసు, ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేశ్, ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ అనుదీప్ కె.వి, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.